ఈశ్వరునికి(Lord Shiva) అత్యంత ఇష్టమైనది శివరాత్రి (Maha Shivaratri). బ్రహ్మ విష్ణువులకు జ్ఞానబోధ చేయడానికి పరమేశ్వరుడు లింగరూపం ధరించిన మహోత్తర సమయం మహా శివరాత్రి (Maha Shivratri).
ఇది మాఘ బహుళ చతుర్దశి సమయంలో జరిగింది. అందుకనే ఆ రాత్రిని శివరాత్రి పండుగగా జరుపుకుంటున్నాం. ఈ మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్ర పర్వదినం. శివుడికి పండ్లు, నైవేద్యం, ఆకులను సమర్పిస్తారు. శైవ భక్తులు, జాగారం ఉపవాసముండి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. శివరాత్రి మధ్యరాత్రిని లింగోద్భవ సమయం అంటారు. లింగోద్భవ సమయంలో ఈ సృష్టిలోని సకల తీర్థాలు శివలింగంలో నిలిచి ఉంటాయి. అందుకే ఆ సమయంలో ప్రతీ భక్తుడూ శివలింగారాధన చేయాలి.

శివరాత్రి రోజున కఠిన నియమాలను పాటించనక్కర్లేదు. నిండుమనసుతో శివుడిని పూజిస్తే చాలు, భక్తులను ఇట్టే అనుగ్రహిస్తాడు. ఒకసారి శివరాత్రి విశిష్టత గురించి శివున్ని (Lord Shiva)
పార్వతీ దేవి(Mata Parvati)అడగ్గా.. శివరాత్రి పండుగ తనకెంతో ప్రీతిపాత్రమనీ, ఆ రోజు కనీసం ఉపవాసమున్నా కూడా తానెంతో సంతోషిస్తానని తెలిపాడు. అలాగే మహాశివరాత్రి రోజు చేసే మౌనవ్రతం కూడా తనకు అత్యంత ఇష్టమని తెలిపాడు. శివుడు చెప్పిన దానినిప్రకారం.. మహాశివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపంతో జాగరణ చేస్తే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి, శివపూజ చేసి, రాత్రి జాగరణ చేస్తారో వారిని పరమేశ్వరుడు నరకం నుంచి రక్షించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.