సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh Babu) ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Pata) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ముగిసిన తరువాత మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ గాసిప్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నాడని గతంలో వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. కాగా, అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేష్ బాబుకు జోడీగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటించనుంది.