మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెహర్ రమేష్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘భోళా శంకర్‌’ మోహన రాజా దర్శకత్వంలో చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలు ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అలాగే చిరంజీవి యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తన 154వ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ నటించనుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు.

ఇదిలావుంటే, ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్
తనకు తెలియకుండానే ఈ సినిమా టైటిల్ లీక్ చేశాడు. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ పెడుతున్నారని కొన్ని రోజుల కిందట వార్తలు వినిపించాయి. అయితే తాజాగా శేఖర్ మాస్టర్ ఆ టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని అసలు విషయం బయటపెట్టేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. చిరు-బాబీ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రాఫర్ గా చేస్తున్నానని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే టైటిల్ రివీల్ చేశాడు. అయితే ఈ మూవీ టైటిల్ అధికారికంగా ప్రకటించాలి అనుకున్న చిత్రబృందానికి ఇదొక షాక్ అని చెప్పొచ్చు.