ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త రూపు సంతరించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఉదయం 9.05 – 9.45 గంటల మధ్య లాంఛనంగా కొత్త జిల్లాలను ప్రారంభించారు. కొత్త జిల్లాలను ప్రారంభించిన అనంతరం జిల్లాల ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా వివరించారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు. పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావాలనే మార్పులు చేశామన్నారు.
కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగిందన్నారు. గ్రామంతో మొదలుకుని రాజధాని వరకూ వికేంద్రీకరణే తమ విధానమని జగన్ స్పష్టం చేశారు. ఈరోజు నుంచి మనది 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం ఏర్పడింది. తమతమ బాధ్యతలు తీసుకుని, పనులు ప్రారంభిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాను అని సీఎం జగన్ పేర్కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విస్తీర్ణపరంగా చూస్తే ప్రకాశం జిల్లా అతి పెద్దదిగా నిలువగా.. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు, కడప జిల్లాలు నిలిచాయి. రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉండగా.. కోనసీమ జిల్లా తర్వాత స్థానంలో ఉంది. అలాగే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లు 72కు పెరగ్గా.. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు నేడు బాధ్యతల స్వీకరించారు. కాగా, 42 ఏళ్ల తర్వాత ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటయ్యారు. చివరిసారిగా 1979లో విజయనగరం జిల్లాను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Recent Comment