పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్(Pawan Kalyan) ప్ర‌స్తుతం మంచి స్పీడు మీదున్నాడు. వరుసగా సినిమాల‌ను అంగీకరిస్తూ ముందుకెళ్తున్నాడు. అటు రాజ‌కీయాల‌ను చేసుకుంటూనే ఇటు సినిమా షూటింగ్‌ల‌లో కూడా పాల్గొంటున్నాడు. ఇటీవల భీమ్లా నాయక్‌తో మంచి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఆయనప్రస్తుతం క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Viramallu) సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్‌ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ నటిస్తోంది.

ఈ సినిమా కోసం పవ‌న్ క‌ల్యాణ్ ఏప్రిల్ నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు డేట్స్ ఇచ్చాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ ఈరోజు హైద‌రాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్స్ లో మొద‌లైంది. ఈ షెడ్యూల్ లో ప‌వ‌న్ కల్యాణ్ ఏప్రిల్ 8 నుంచి పాల్గొననున్న‌ట్టుతెలుస్తోంది. కాగా, ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది.