సూపర్ స్టార్ మహేశ్‌బాబు(Mahesh babu) ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆ మూవీ చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడుగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇది మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో రానున్న ఈ మూవీ మల్టీస్టారర్​ చిత్రమని, ఇందులో నటసింహం నందమూరి బాలయ్య కూడా నటిస్తారని గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ అంశంపై దర్శకుడు రాజమౌళి(Rajamouli) క్లారిటీ ఇచ్చారు. ‘ఆర్​ఆర్​ఆర్’​ ప్రమోషన్స్​లో భాగంగా బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మహేశ్ బాబు ఒక్కడే హీరో అని ఇది మల్టీస్టారర్ మూవీ కాదని తేల్చిచెప్పారు. అలాగే మహేశ్​ బాబుతో చేయబోయే మూవీ భారీ బడ్జెట్ తో ఆఫ్రికాలోని దట్టమైన అటవీప్రాంతాల్లో తెరకెక్కించనున్నట్టు పేర్కొన్నారు. ఇదిలాఉంటే, మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు.