దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(Rajamouli), యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan)ల కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. అల్లూరి సీతా రామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. అయితే ఈ సినిమా చూశాక రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు అందరూ జేజేలు పలుకుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా సరికొత్త రికార్డులను సాధిస్తుందని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే విడుదలైన తొలి రోజు రూ.223 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం తాజాగా రూ.500 కోట్ల మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు భారత చలన చిత్ర చరిత్రలో ఏ సినిమా కూడా ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టలేదని చెప్పొచ్చు. ఇక హిందీలో శుక్రవారం రూ.19 కోట్లు, శనివారం రూ.24 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్ మూవీ.. ఆదివారం రోజు మాత్రం రూ.31.50 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. మొత్తంగా హిందీలోనే ఈ సినిమా ఇప్పటివరకు రూ.74.50 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈ 500 వందల కోట్ల వసూళ్లను సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ వారం కూడా అదే జోరు కొనసాగిస్తే 1000 కోట్ల మార్క్ కూడా సునాయాసంగా చేరుకునే అవకాశం ఉంది.