1980-90ల జమ్మూకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాల ఆధారంగా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం “ది కశ్మీర్‌ ఫైల్స్‌”. మార్చి 11న విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లను కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌ నటులు అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి, నటి పల్లవి జోషిలు ప్రధాన పాత్రలు పోషించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన ఈచిత్రాన్ని.. తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. ఇప్ప‌టికే అందుకు సంబందించిన డ‌బ్బింగ్ ప‌నులు కూడా ప్రారంభ‌మైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెల రెండో వారంలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు చిత్ర బృందం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌తో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వినోదపు పన్నును మినహాయించిన విషయం తెలిసిందే.