ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణెను( Deepika Padukone ) ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ అక్టోబర్‌ రెండో వారం నుంచి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కేజీఎఫ్2 మూవీ ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ క్రమంలో చిత్రబృందం భారీగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నేను ఎన్టీఆర్ కు గత 15 ఏళ్లుగా వీరాభిమానిని. మేమిద్దరం కలిసి చేయబోయే సినిమా కోసం ఈ మధ్య చాలా సార్లు కలిశాం. ఆయనకు నేను చెప్పిన కథ నచ్చడంతో దానిపై పూర్తిగా నాపై పూర్తి నమ్మకముంచారు. ఈ మూవీ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను.” అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. కాగా, ఆయన ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమా చేస్తుండగా.. అది పూర్తవగానే ఎన్టీఆర్ తో సినిమా పట్టాలెక్కించనున్నాడు.