దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్(Ram Charan), ఎన్టీఆర్(Ntr) ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఆర్​ఆర్​ఆర్​’ (RRR) కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా తొలి ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్​ వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డుల‌ను బ్రేక్ చేసి అక్కడ వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించింది. అంతకుముందు బాహుబలి చిత్రం వంద కోట్ల మార్కును చేరుకోడానికి వారం రోజుల సమయం పట్టగా, ఆర్ఆర్ఆర్ సినిమా తొలి ఐదు రోజుల్లోనే ఈ మైలురాయిని దాటేసింది…

ఇదిలాఉంటే, ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల విషయంపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఆర్ఆర్ఆర్ సినిమా నా కెరీర్ లో ఓ ప్రత్యేకమైన చిత్రం. నటుడిగా ఇప్పటివరకూ చేసిన దానికంటే ఈ సినిమా నాకు ఎంతో సంతృపినిచ్చింది. ఇలాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు గర్వపడుతున్నాను. నా దృష్టిలో సినిమాల గురించి చెప్పాలంటే తొలుత ప్రశంసలు, ఆ తర్వాతే బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌. ఎందుకంటే నాకు కలెక్షన్స్ తో ఎలాంటి సంబంధం ఉండదు. అయితే.. కలెక్షన్స్ పెరిగితే.. నటీనటులకు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంతే ” అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.