దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) కథానాయకులుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా తాజాగా 1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. విడుదలైన 16 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్లు వసూలు చేయడంపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. సోమవారం సాయంత్రం నాటు నాటు ఫుల్‌ వీడియో పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ పాటను కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించగా.. కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటలో ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లు వేసిన స్టెప్పులకు సినీప్రియులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. RRR మూవీ ప్రమోషన్స్‌ సమయంలోనూ చాలా మంది సెలబ్రిటీలు ఈ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఈ పాటను అనుకరిస్తూ వివిధ భాషల్లో అనేకమంది తమదైన స్టైల్​లో రీల్స్​, వీడియోస్​ చేసి ఎంతగానో ఆకట్టుకున్నారు.