మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌'(RRR). ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని చెప్పొచ్చు. తాజా సమాచారం ప్రకారం, ఆర్ఆర్ఆర్ చిత్రం సేఫ్ జోన్‌లోకి రావాలంటే తెలుగు రాష్ట్రాల్లో(తెలంగాణ+ఆంధ్రప్రదేశ్)లో కలిపి మొత్తంగా 190 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది.

అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్క మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా దేశంలో ఎక్కువ స్క్రీన్ లలో రిలీజ్ కానున్న తొలి భారత్ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు సాధించిందని ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. కాగా, ఇందులో కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీతో ఆలియా భట్‌ జోడీ కడుతుండగా తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటించనున్నారు. అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.