దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram Charan) హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లోనే 800 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందాన్ని ఇంటికి పిలిచి మరీ కానుకలు ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన అధిపతులను ఆదివారం ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం(10 గ్రాముల) గోల్డ్ కాయిన్, ఒక కేజీ స్వీట్ బాక్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. వీరిలో డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్లు, మేనేజర్లను, అకౌంటెంట్లను, కెమెరా అసిస్టెంట్లు ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మంది ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఇంతటి విజయం సాధించడం వెనుక వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా మెగాపవర్ స్టార్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.