దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) కథానాయకులుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సఫీసు వద్ద సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతగా 20 రోజులు పూర్తి చేసుకున్న RRR సినిమా కలెక్షన్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 19వ రోజుతో చూసుకుంటే 20వ రోజు వసూళ్లు కాస్త తగ్గాయి.. 19వ రోజుకు గాను 64 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా 20వ రోజు 34 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా మొత్తంగా ఈ 20 రోజుల్లో 260.11 కోట్ల షేర్, అలాగే 392.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే విడుదలైన 20 రోజుల్లో ఈ సినిమా 572.48 కోట్ల నెట్, 1049 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు సమాచారం. విడుదలకుముందు 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ ప్రస్తుతం 124 కోట్లకు పైగా లాభాలతో కొనసాగుతోంది. బాక్సఫీసు వద్ద ఈ సినిమా రన్ ముగుస్తుండడంతో త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.