యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా సీనియర్ దర్శకుడు సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. (Agent) ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా.. అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏజెంట్ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు చాక్లెట్ బాయ్‌గా కనిపించిన అఖిల్‌ ఈ సినిమా కోసం యాక్షన్‌ హీరోగా మారుతున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో అఖిల్ సరికొత్త లుక్ లో ఆకట్టుకున్నాడు. అయితే తాజాగ ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏజెంట్ సినిమా నుంచి ఓ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఫుల్ మాస్ లుక్ లో ఉన్న అఖిల్ షర్ట్ లేకుండా సిగరెట్ కాలుస్తూ కనిపిస్తున్నాడు. ఈ లుక్‌ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. కాగా, ఏజెంట్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.