దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్తూ బాక్సఫీసు దుమ్ముదులుపుతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్‌,(Ram Charan) ఎన్టీఆర్ నటనపై యావత్ సినీ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. ఫ్యాన్స్ తో పాటుగా,రాజకీయవేత్తలు సినీ ప్రముఖులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’టీమ్‌పై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ దేశం గర్వించదగ్గ సినిమా అని, రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి భారత సినీ సత్తాను ప్రపంచానికి తెలిసేలా చేసిందని అన్నారు. అలాగే, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు రాబడుతుందని ఆయన అన్నారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మాదిరిగానే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో సరికొత్త రికార్డులు సాధిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇక కేంద్రమంత్రి వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఆర్ఆర్ సంతోషం వ్యక్తం చేసింది.