ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2022వ సీజన్ ఈ రోజు ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, గతేడాది రన్నరఫ్ కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి 7.30 గంటలకు జరగనున్న తొలి మ్యాచుతో ఐపీఎల్‌-2022 మెగా టోర్నీకి తెరలేవనుంది. కాగా కోవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది సీజన్‌ను ముంబై, పూణే వేదికల్లో నిర్వహించనున్నారు.

అయితే పూర్తిస్థాయి ప్రేక్షకులను కాకుండా కేవలం 25 శాతం మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అలాగే ఈ ఈసారి ఐపీఎల్ లో రెండు కొత్తజట్లు( గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జేయింట్స్) చేరడంతో టోర్నీలో పాల్గొంటున్న 10 జట్లను రెండు ప్రధాన గ్రూప్‌లుగా విభజించారు. ఈ ఫార్మాట్ లో ఒక్కో జట్టు తన గ్రూప్‌లోని మిగిలిన 4 జట్లతో రెండేసి మ్యాచులు, అలాగే మరో గ్రూప్‌లోని తమ స్థానంలో ఉన్న ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగిలిన 4 జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ఇక ప్రతీ సీజన్ లో 60 మ్యాచ్‌లు జరుగుతుండగా, ఈసారి రెండు కొత్త జట్ల రాకతో మరో 14 మ్యాచ్‌లు పెరిగి మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 74కు పెరిగింది.

ఇదిలావుంటే.. ఐపీఎల్ 15వ సీజన్ తొలి మ్యాచులో పోటీపడనున్న చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ జట్టు ఇప్పటివరకు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి.. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 17 మ్యాచుల్లో విజయం సాధించగా.. కేకేఆర్ జట్టు 8 మ్యాచుల్లో విజయం సాధించింది.. ఒక దాంట్లో ఫలితం తేలలేదు.