కోలీవుడ్‌ స్టార్ హీరో దళపతి విజయ్‌ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘బీస్ట్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ట్రైలర్​లో విజయ్ యాక్షన్ వారెవ్వా​ అనిపించేలా ఉంది. ఈ ట్రైలర్​ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

ముఖ్యంగా ఈ ట్రైలర్ లో ‘రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని’ అన్న డైలాగ్​ అద్భుతంగా ఉంది. కాగా, యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ మూవీలోని అర‌బిక్ కుత్తూ పాట24కోట్ల వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా లెవ‌ల్లో ఏప్రిల్ 13న విడుద‌ల కానుంది.కాగా, ఇప్పటికే చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో షైన్‌ టామ్‌ చాకో, సెల్వరాఘవన్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.