పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ( Prabhas ) యంగ్ డైరెక్టర్ మారుతి (Maruthi ) దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. కామెడీ, హార్రర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించబోతున్నట్టు సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం మారుతి అద్భుతమైన కథను సిద్ధం చేశాడట. ఇక ఈ ప్రాజక్టుకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల మోకాలికి సర్జరీ చేయించుకున్న ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన కోలుకున్న తరువాత తన తదుపరి సినిమాలను ప్రారంభించే అవకాశముంది.