టాలీవుడ్​ కింగ్​ నాగార్జున(Nagarjuna), కథానాయకుడుగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ది ‘ఘోస్ట్​'(The Ghost). ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్లపై నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా.. తాజా షెడ్యూల్‌ ఊటీలో జరుగుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. దర్శకుడు ప్రవీణ్​ సత్తారు సోషల్​మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు. దీనికి ‘ఉదయం ఎప్పుడూ మ్యాజికల్​గానే ఉంటుంది’ అని క్యాప్షన్ జతచేశారు.

ఊటీలో జరుగుతున్నా ఈ షెడ్యూల్ లో హీరోయిన్‌ సోనాల్‌ చౌహన్‌, నాగార్జునలకు సంబంధించిన ఓ సాంగ్‌, రొమాంటిక్ సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌‍కు చిత్ర బృందం ప్లాన్‌ చేసిందట. కాగా, శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగ్​ మాజీ రా అధికారిగా కనిపించనున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.