పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ రాధేశ్యామ్‌ సినిమాతో ఇటీవల అభిమానుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్‌, సలార్‌, స్పిరిట్‌ చిత్రాలు ఆయన చేయబోతున్నాడు. అయితే రాధేశ్యామ​ సినిమా విడుదల తర్వాత ప్రభాస్‌ మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సలార్‌ షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు మేకర్స్. అయితే ఈ తాజా సమాచారం ప్రకారం ప్రభాస్‌ పూర్తిగా కోలుకోవడానికి ఇంకో నెల సమయంలో పడుతుందట. అంటే దాదాపు 3 నెలలపైనే ప్రభాస్‌ విశ్రాంతిలోనే ఉండనున్నాడని సమాచారం.

దీంతో సలార్‌ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజుల సమయం పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు రాజమన్నార్‌గా కనిపించనున్నాడు. హీరోయిన్‌ శ్రుతీ హాసన్‌ ఆద్య రోల్‌ పోషిస్తోంది. సలార్‌ సినిమా విషయానికి వస్తే ఇది బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగండూర్‌ నిర్మిస్తున్నాడు. రవి బసూర్ సంగీతం అందిస్తున్నాడు