యువ కథానాయకుడు నితిన్‌ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్‌.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి ఇందులో నితిన్‌ సరసన నటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 8న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే మ‌రో సినిమాను లైన్‌లో పెట్టాడు. వ‌క్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించాడు. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటించనుంది. ఈ మూవీ నేడు హైద‌రాబాద్లో జరిగిన పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభమైంది.

ఈ సినిమా ముహూర్తం షాట్‌కు పుస్కూర్ రామ్‌మోహన్‌రావు క్లాప్‌ కొట్టగా, ఉమేష్ గుప్తా కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వక్కంతం వంశీకి సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, ఠాగూర్ మధు స్క్రిప్ట్‌ను అందజేశారు.ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం.