పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన నటించిన రాధేశ్యామ్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్ర‌భాస్ న‌టించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జరుపుకుంటుండగా.. ఆయన నటించిన ‘స‌లార్’ ( Salaar ), ‘ప్రాజెక్ట్-K’ ( Project K ) సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటితోపాటుగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ‘స్పిరిట్’ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

అయితే వీటితో పాటుగా ప్రభాస్‌ మారుతి (Maruthi ) దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. కామెడీ, హార్రర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా కూడా ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం దర్శకుడు మారుతి సిద్ధం చేస్తున్న కథలో కొన్ని మార్పులు చేయమని ప్రభాస్ కోరినట్లు సమాచారం. అందుకే ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల మోకాలికి సర్జరీ చేయించుకున్న ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన కోలుకున్న తరువాత తన తదుపరి సినిమాలను ప్రారంభించే అవకాశముంది.