మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్‌’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. పొలిటికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపిస్తారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్(Gaddar) ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై కీలక సన్నివేశాల షూట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన గద్దర్.. గాడ్‌ఫాదర్‌ సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చేయని నేరానికి చిరంజీవి జైలుకు వెళతారని అక్కడ చిరంజీవికి తనకు మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సినిమాలో చిరంజీవి తండ్రికి స్నేహితుడిగా తాను కనిపిస్తానని గద్దర్ అన్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) కూడా నటించనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే స్వయంగా చిరంజీవి వెల్లడించారు.