దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajmouli) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(Ntr), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరీస్‌, చరణ్ సరసన అలియా భట్ నటించారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. కాగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానుంది.

అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింది. కన్నడ ప్రజలు ట్విట్టర్ వేదికగా #BoycottRRRinKarnataka అనే హ్యాష్ ట్యాగ్‌తో మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవలే కర్ణాటకలోని చిక్‌ బళ్లాపూర్‌లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు చిత్రబృందం. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై కూడా హాజరై ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపించారు. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కన్నడ భాషలో రిలీజ్‌ కాకపోవడంతో అక్కడి అభిమానులు మండిపడుతున్నారు. తెలుగు, హిందీ,తమిళంలో విడుదల చేసి కన్నడ భాషలో రిలీజ్ చేయకపోవడం తమ రాష్ట్రాన్ని అవమానించడమేనని నిప్పులు చెరుగుతున్నారు.