నాచురల్‌ స్టార్‌ నాని(Nani) కథానాయకుడుగా యంగ్ డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అంటే సుందరానికి’.(Ante Sundaraniki ). మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ .వై నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడిగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను చిత్రయూనిట్ ప్ర‌క‌టించారు. ‘అంటే సుంద‌రానికి’ మూవీ టీజ‌ర్‌ను ఏప్రిల్ 20న ఉద‌యం 11.07 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్రకటించారు. అలాగే ఓ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా, వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీని తెలుగు లోనే కాకుండా తమిళ, మళయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జరుపుకొంటోంది.