Report Says OTT Market In India Rapidly Growing: భారత్ లో దూసుకుపోతున్న ఓటీటీ

భారతదేశంలో దేశీ వీడియో ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) సర్వీసుల జోరు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. ఓటీటీ స్ట్రీమింగ్‌ పరిశ్రమ వచ్చే పదేళ్లలో 22–25 శాతం మేర వార్షిక వృద్ధి సాధించనుంది. 13–15 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.12 లక్షల కోట్లు) స్థాయికి చేరనుంది. ప్రస్తుతం దేశంలో దీని మార్కెట్ వాటా 7-9 శాతంగా ఉంది. వినియోగదారుల సంఖ్య కూడా 17శాతం వృద్ధి చెందనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూజర్ల సంఖ్య సంఖ్య 10.2 కోట్లు కాగా, 2026 నాటికి 22.4 కోట్లకు చేరుకుంటుందని డెలాయిట్ ‘ఆల్ అబౌట్ స్క్రీన్స్’ నివేదికగా పేర్కొంది. దేశంలో తక్కువ ధరకే వేగవంతమైన ఇంటర్నెట్‌ సదుపాయం ఉండడం, గత ఐదేళ్ళలో మొబైల్ , ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య రెట్టింపు కావడం వంటి అంశాలు ఇందుకు తోడ్పడుతున్నాయని ఆల్ అబౌట్ స్క్రీన్స్’ నివేదిక తెలిపింది.

కాగా, దేశంలో ప్రస్తుతం ఆహా, జీ5, ఎరోస్‌ నౌ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ హాట్‌స్టార్‌ ప్లస్, ఆల్ట్‌ బాలాజీ, సోనీలివ్‌, ఇరోస్‌నౌ, అల్ట్‌బాలాజీ, హోయ్‌చొయ్, అడ్డా టైమ్స్‌ వంటి సంస్థలు ఓటీటీ విభాగంలో ఉన్నాయి. ఓటీటీ సంస్థలు గతేడాదితో కంటెంట్‌‌ కోసం 665 మిలియన్ల డాలర్లు (దాదాపు రూ.ఐదు వేల కోట్లు) పెట్టుబడి పెట్టాయి. నెట్‌‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్‌ ప్లస్ 380 మిలియన్ల డాలర్ల ఇన్వెస్ట్​మెంట్​తో (దాదాపు రూ.2,839 కోట్లు) పెట్టుబడులతో తొలి మూడుస్థానాల్లో నిలిచాయి. ఓటీటీ ప్లాట్‌‌ఫారమ్‌‌లలో ప్రాంతీయ భాషల కంటెంట్ వాటా 2019లో 30శాతం నుండి 2025 నాటికి 50 శాతం దాటనున్నట్లు తెలుస్తోంది.