బుల్లితెర అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ ఓటీటీ షో ఈ శనివారం నుంచి ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ (Bigg Boss OTT Telugu) పేరుతో ‘డిస్నీ+ హాట్‌స్టార్‌'(Disney+ Hotstar)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలోనే గత ఐదు సీజన్స్‌లో పాపులర్‌ కంటెస్టెంట్లతో పాటు కొత్త కంటెస్టెంట్లతో 24గంటలపాటుగా నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు బిగ్‌బాస్‌ ఓటీటీ సిద్దమయింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతానికైతే 12 వారాలు అంటే దాదాపు 84 రోజులు అని చెప్తున్నారు కానీ.. ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లభిస్తే ఇంకా పెంచే అవకాశం ఉంది.

అయితే ఈ మెగా షోకి హోస్ట్ గా ఎవరు చేస్తారు అనే ప్రశ్న ఇంకా ఆసక్తికరంగానే ఉంది. గత సీజన్ కి చెందిన కొందరి కంటెస్టెంట్స్ పేర్లు ఈ సీజన్ కి హోస్ట్ గా వినిపించాయి. కానీ ఇపుడు మరో కొత్త పేరు తెరమీదకు వచ్చింది. చివరి సీజన్లో కచ్చితంగా ఫైనల్స్ లో అడుగుపెడతాడు అనుకున్న కంటెస్టెంట్ యాంకర్ రవి ఇప్పుడు బిగ్‌బాస్‌ ఓటీటీ హోస్ట్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.