తెలుగు చిత్రపరిశ్రమకు పెద్దదిక్కుగా ఉండటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో సినీ కార్మికులకు హెల్త్‌ కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అయితే ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ సినీపరిశ్రమకు నేను పెద్దగా వ్యవహరించను. ఆ పదవి నాకస్సలు వద్దు. కానీ బాధ్యత గల సినిమాతల్లి బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకు వస్తాను. కానీ అనవసరంగా ఎందులో కూడా తలదూర్చను. ముఖ్యంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్ల మధ్య గొడవ జరిగితే మాత్రం ఆ వివాదాలు నేను పరిష్కరించను.” అని చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ తెలుగు చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోని అందరికి 50 శాతం రాయితీతో టెస్టులు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో ఆదివారం ఉదయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.