దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రౌద్రం..రణం..రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్‌)’మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సినీప్రియులు ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో రాజమౌళి టీమ్‌ ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా కేరళలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం  సందడి చేసింది. బుధవారం సాయంత్రం తిరువనంతపురంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది చిత్రయూనిట్‌. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళితో పాటుహీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ కూడా హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమంలో  పాల్గొన్న ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న డిప్రెషన్‌ గురించి వెల్లడించాడు. ” చిన్న వయస్సులోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. నా రెండవ సినిమాకే అద్భుతమైన విజయాన్ని చూశాను. కానీ ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. వరుసగా ఫ్లాప్స్ ఎదురయ్యాయి. ఆ సమయంలో  పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజమౌళి నాకు అండగా నిలబడ్డాడు.  వరుస పరాజయాలతో ఉన్న నాకు యమదొంగ లాంటి భారీ హిట్‌ ఇచ్చి మళ్లీ నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టాడు. రాజమౌళి లాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విషయానికొస్తే.. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమురం భీంగా  ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ అలరించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ కు జోడిగా ఒలివియా మోరీస్‌, చరణ్ సరసన  అలియా భట్ నటించారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరాలూ సమకూర్చాడు.