యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది. దీంతో రాజమౌళి టీం గత కొన్ని రోజులుగా వరుస ఈవెంట్లలో పాల్గొంటోంది.  ఈ క్రమంలోనే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న జక్కన ఈ సినిమా టైటిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా  మొదలుపెట్టినపుడు ఏ టైటిల్‌ పెట్టాలో అర్థం కాలేదు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి పేర్లు కలిసొచ్చేలా ఈ ప్రాజెక్టును ‘ఆర్‌ఆర్‌ఆర్’ అని పిలవాలనుకున్నాం. అలా #RRR హ్యాష్‌ట్యాగ్‌తోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇచ్చాం. ఈ పేరుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’నే  సినిమా పేరుగా ఫిక్స్ చేశాం  అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

కాగా, భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్‌ ఇండియా సినిమా 2022 జనవరి 7న విడుదలకానుంది.ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌ నటించారు. శ్రియ, అజయ్‌దేవ్‌గణ్‌, సముద్రఖని తదిరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.