రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లైగర్‌’. అనన్యపాండే కథానాయిక. కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌టైసన్‌ ఓ కీలక పాత్రలో సందడి చేస్తారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్ట్‌ 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌ 31న ఉదయం లైగర్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు మేకర్స్.

అయితే ఈ ఫస్ట్‌ గ్లింప్స్‌ తో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. మొన్నటిదాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. లైగర్ వీడియోకు విడుదలైన 24 గంటల్లోనే 15.92 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో వ్యూస్ పరంగా చూస్తే 8.49 మిలియన్ వ్యూస్‌తో అప్పటిదాకా మొదటి స్థానంలో ఉన్న పవర్ స్టార్ ‘భీమ్లా నాయక్’ రికార్డు బద్దలుకొట్టాడు విజయ్ దేవరకొండ