ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. కేకే రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదలవుతోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా సంక్రాంతి బరిలో ఉన్న కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడుతుండగా.. ‘రాధేశ్యామ్’​ విడుదల​పై కూడా అనుమానాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ‘రాధేశ్యామ్’​ చిత్రాన్ని నేరుగా డిజిటల్​​ రిలీజ్ చేయడం​ కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్​ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.300కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్ ను నిర్మాతలు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని చిత్రబృందం స్పష్టం చేసినట్లు సమాచారం.

కాగా, ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ పని చేస్తుండటం విశేషం.