యువ హీరో విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘లైగ‌ర్‌’. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా లైగర్‌ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్‌ బాక్సర్‌గా విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ – ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్,  ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, హిరూ యశ్ జోహార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ  సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో విడుదల  కానుంది.  ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ‘లైగ‌ర్‌’ మూవీ  గ్లింప్స్ రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 31 వ తేదీన 10:03 గంటలకు గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా  కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ఫిక్స్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 25న విడుదల చేస్తామని ప్రకటించారు.