నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. బాలయ్య కెరీర్‌లో 107వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే గోపిచంద్‌ మంచి కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మ‌రో అప్‌డేట్‌ను అందించింది చిత్రబృందం . ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు దునియా విజయ్ ఇందులో కీలక పాత్రలో న‌టించ‌బోతున్నట్లు ప్రకటించింది. చిన్న సినిమాలతో నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన విజయ్‌ ‘దునియా’ సినిమాతో  నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘ఆర్‌ఎక్స్‌ సూరి’,  ‘కంఠీరవ’, ‘వీర బాహు’, ‘జాక్సన్‌’ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో ఆయన నటిస్తున్న తొలిచిత్రమిదే కావడం విశేషం.

కాగా, ఇటీవలే బాల‌కృష్ణ..‘అఖండ‌’ సినిమాతో భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అదే జోరుతో త‌న ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తున్నారు.  ఈ చిత్రానికి వేట‌పాలెం అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది  జ‌న‌వ‌రి 20 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది.