యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా  నటించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’.  ఈ సినిమాలో ప్రభాస్‌ జోతిష్య నిపుణిడిగా కనిపించనుండగా.. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే అలరించనుంది. ఈ చిత్రానికి కేకే రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు.  కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. ఇటీవలే హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న విడుదల కానుంది. కాగా, ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మేకర్స్  చేస్తున్న సినిమా ప్రమోషన్స్‌ కూడా ఈ అంచనాలకు ఒక కారణంగా చెప్పొచ్చు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రయూనిట్ సభ్యులు మ్యూజికల్ టూర్స్ ను ప్లాన్ చేశారు. విశాఖపట్నంలో రాధే శ్యామ్ ప్లెక్సీ లతో ఒక వెహికిల్ లో మ్యూజిక్ ట్రూప్  టూర్ ప్రారంభమైంది. ఆ వెహికిల్ లో రాధే శ్యామ్ సినిమా పాటలను పాడుతూ మ్యూజిక్ ట్రూప్ ప్రేక్షకుల్ని  అలరించబోతున్నారు.  ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కోసం సెన్సెషనల్ మ్యూజిక్‌ డైరెక్టర్ తమన్‌ రంగంలోకి దిగాడు. రాధేశ్యామ్‌ చిత్రానికి సంబంధించి దక్షిణాది భాషలకు తమన్‌ బీజీఎం అందిస్తాడని యూవీ క్రియేషన్స్‌ తెలిపిన విషయం తెలిసిందే. కాగా,  ఈ సినిమాకి ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ సినిమా ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ పని చేస్తుండటం విశేషం.