మెగా స్టార్ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బోళా శంకర్‌’. ఇందులో చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేశ్, హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ అందిస్తుండగా..   ప్ర‌స్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటోంది.

అయితే తాజాగా ‘భోళా శంక‌ర్’  సినిమా నుంచి నూతన సంవ‌త్స‌ర కానుకగా సంద‌ర్భంగా చిత్ర బృందం మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌లో మెగా స్టార్ మాస్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. చేతికి క‌డియం, తాయెత్తులు క‌ట్టుకుని ప‌క్కా ఊర‌మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. కాగా, తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రం తమిళ వెర్షన్‌లో అజిత్ హీరోగా నటించాడు. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పాటు పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది.

ఇదిలాఉంటే,  చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఖైదీ నెం150తో రీఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ వరసగా ప్రాజెక్ట్స్‌ను ప్రకటిస్తూన్నాడు. ఇప్పటికే ఆయన ఆచార్య, గాడ్‌ ఫాదర్‌, భోళా శంకర్‌ వంటి చిత్రాలతో బిజీగా ఉండగా ఇటీవల మరో కొత్త సినిమాను ప్రకటించాడు. చిరంజీవి 156వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఛలో, భీష్మ వంటి హిట్‌ చిత్రాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్‌ వెంకీ కుడుముల డైరెక్షన్‌ ఈ మూవీ రూపొందనుంది.