నటసింహం నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ కథానాయకుడుగా నటించిన ‘అఖండ’ చిత్రం జోరు ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్‌ 2న విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అఖండ మూవీ విడుదలై నేటికి 26 రోజులు పూర్తి చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ షోలతో దుమ్మురేపుతోంది అఖండ చిత్రం.
తాజా సమాచారం ప్రకారం అఖండ చిత్రం ఇప్పటివరకు రూ. 125 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది.
కాగా, బాలకృష్ణ- బోయపాటి శ్రీనుల హ్యాట్రిక్‌ చిత్రమిది. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు.
ఇదిలావుంటే.. రూ.53 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌తో బరిలోకి దిగిన ఈ అఖండ చిత్రం విడుదలైన 7 రోజుల్లోనే లక్ష్యాన్ని చేరుకొని బ్రేక్‌ ఈవెన్‌లోకి దూసుకెళ్లింది. మొత్తం మీద బాక్సాఫీస్‌ వద్ద బాలయ్య కలెక్షన్ల ప్రభంజనం సృష్టించడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.