నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు నాని, బ్రహ్మానందం, అల్లు అర్జున్, అనిల్‌ రావిపూడి, రాజమౌళి వంటి ఎందరో సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ సైతం ఈ షోలో సందడి చేశాడు.

ఈ ఎపిసోడ్‌లో రవితేజ సినిమాల గురించి మాట్లాడుతూ.. తాను నటించిన సినిమాలు ఏమైనా ఫ్లాప్‌ అయితే తనకిచ్చిన పారితోషికంలో కొంత మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేస్తానని పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ రవితేజ గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నారు. నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ లాభపడుతుందన్న విషయాన్ని రవితేజ గుర్తించాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘రావణాసుర’ సినిమాల్లో నటిస్తున్నాడు.

కాగా, గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ సినిమాతో రవితేజ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. 2017 లో విడుదలైన రాజా ది గ్రేట్ మూవీ తర్వాత రవితేజ వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఏడాది ప్రారంభంలో విడుదలైన క్రాక్ అనూహ్య రీతిలో విజయాన్ని అందుకున్నాడు.