రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). చారిత్రక పాత్రలకు ఫిక్షనల్‌ స్టోరీ జోడించి జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, ఆయన జోడీగా అలియాభట్‌ నటిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండగా ఆయనకు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ సందడి చేయనున్నారు.నిజానికి ఈ చిత్రం 2020 జూలై 30న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ చివ‌ర‌కు జ‌న‌వ‌రి 7, 2022న ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం నిర్ణయించుకుంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  విడుదల మళ్ళీ  వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారితో పాటుగా , కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని వాయిదా వేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ప్రస్తుత ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత జూన్‌లో ఈ సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా,  డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.