యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎక్కువగా యూత్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో విజయ్‌ దేవరకొండ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలుత సహాయ నటుడిగా కెరీర్ ఆరంభించిన విజయ్‌ దేవరకొండ ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ స్థాయికి ఎదిగాడు. ఇక సోషల్‌ మీడియాలో కూడా విజయ్‌ దేవరకొండకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్‌ ఫాలోవర్స్‌తో సరికొత్త రికార్డ్‌ను సృష్టించాడు ఈ రౌడీ హీరో.
సినీపరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ తర్వాత ఈ ఘనతను సాధించిన తెలుగు హీరో విజయ్‌ దేవరకొండే కావడం విశేషం. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్‌ దేవరకొండ  హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 25న విడుదల చేస్తామని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. కాగా, కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుకొంటోంది.